చిత్తూరు ( జనస్వరం ) : కార్వేటినగరం మండల కేంద్రంలో జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించి, గైక్వాడ్ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేసి, అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా పని చేసి, మైసూరులో విద్యాశాఖలో విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా వ్యవహరించి, ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించి కవిత్వతత్వ విచారం, అర్థశాస్త్రం, ముసలమ్మ మరణము రాసిన, చిత్తూరు వాసి డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి పేరును చిత్తూరు జిల్లా కి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దామోదరం సంజీవయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి, సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించారు, రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షులు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. అందుకే కర్నూలు వాసి అయిన దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని ఈ సందర్భంగా తెలిపారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసిన అంబేద్కర్ దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు. తరతరాలుగా బడుగు, బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేద్కర్.. వారి అభ్యున్నతకి రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేశారు. ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తిగా అట్టడుగు నుండి ఆకాశానికి ఎదిగిన నేతగా భారత దేశపు ప్రజల మన్ననలు పొందిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును అమలాపురం జిల్లా కు పేరుపెట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, ప్రధాన కార్యదర్శి నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ పాల్గొన్నారు.