అమరావతి, (జనస్వరం) : భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి మన రాజ్యాంగమే మూలమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 మనందరికీ ఎంతో పుణ్యదినం. భారతావని సర్వసత్తాక సార్వభౌమ దేశంగా ఆవిర్భవించిన ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని భారతీయలు అందరికీ నా తరఫున, జనసేన పార్టీ తరఫున 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశం చిరంతనమైన, పటిష్టమైన, సుసంపన్నమైన గణతంత్ర రాజ్యంగా శోభిల్లడానికి రాజ్యాంగం ద్వారా ప్రాణ ప్రతిష్ఠగావించిన రాజ్యాంగ రూపకల్పన సారధి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, రాజ్యాంగ పరిషత్ సభ్యులకూ ఈ సందర్భంగా ప్రణామాలు అర్పిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాతలు దేశ ప్రజలకు అందించిన సమన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం, మత స్వేచ్చ అప్రహతిహతంగా వర్థిల్లాలని… విశ్వ శాంతికి, విశ్వమానవ సౌబ్రాతృత్వానికి, విశ్వ కల్యాణానికి భారతదేశం ఆలంబన కావాలని మనసారా కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.