
ఆత్మకూరు, (జనస్వరం) : యూత్ ఫార్మేషన్ డే సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై భవిష్యత్ పోరాట కార్యాచరణ గురించి చర్చించేందుకు ఈరోజు జనసేన పార్టీ యూత్ ఆధ్వర్యంలో సంగం మండలం దువ్వూరు నుండి ఆత్మకూరు వరకు భారీ బైక్ ర్యాలీ, సంగం గ్రామంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం అనంతరం ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గల 100 మంది యువకులు ఉంటే చాలు, ఈ దేశ స్థితిగతులను మార్చి వేయొచ్చు అన్న స్వామి వివేకానంద గారి స్పూర్తిని గుర్తు చేసుకున్నారు. ఆత్మకూరు నియోజకవర్గ రూపురేఖలను మార్చేసే శక్తి గల, అభివృద్ధిని పరుగులు పెట్టించగలిగే ఆత్మకూరు అభివృద్ధి సోపానాలైన నడికుడి- కాళహస్తి రైల్వే మార్గం భూసేకరణ, ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకం, చుక్కల భూమి సమస్య, సంగం బ్యారేజీ, సమగ్ర సోమశిల పథకం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఇండస్ట్రియల్ పార్క్ నుండి పరిశ్రమల తరలింపు, నియోజకవర్గంలో అద్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితి మొదలగు నియోజకవర్గ సమస్యలపై భవిష్యత్తులో పోరాటాలు చేసేందుకు జనసేన పార్టీ ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.