అమరావతి, (జనస్వరం) : వైసీపీ ప్రభుత్వం సంక్షేమం అనే పేరుతో ఒక ముసుగు వేసుకొని అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో ఉన్న నిధుల్ని కూడా దోచేసి సర్పంచ్ లకు అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం లేకుండా చేశారన్నారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలను కూడా రానివ్వకుండా చేసి శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర అర్థిక సంక్షోభం సృష్టించిందని తెలిపారు. గుంటూరు జిల్లా, తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ఈ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టింది. గతంలో మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలకు ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడతామన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్న చెక్ పవర్ తీసేసింది. నిధులు దుర్వినియోగం చేస్తోంది. 15వ అర్థిక సంఘం నిధులు తిరిగి ప్రభుత్వ ఖజానాకు తీసుకుపోయింది. ఈ పరిస్థితిని జనసేన పార్టీ ఖండిస్తోంది. భవిష్యత్తులో గ్రామ స్థాయిలో అనేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెనాలి పట్టణంలో చూస్తే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ పూర్తి చేయలేకపోవడం స్పష్టంగా కనబడుతోంది. గ్రామ స్థాయిలో పూర్తిగా తమ పార్టీకి ఉపయోగపడే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన సమాచారం ఏ మాత్రం ప్రభుత్వం వద్ద లేదు. నూతన సంవత్సరం వేళ ఈ పరిస్థితులు తొలగిపోయి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాంతం వృద్ధి చెందాలనీ, ప్రతి కుటుంబం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ప్రజా ప్రతినిధులుగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న నాయకులు, కార్యకర్తలు రాష్ట్రానికీ, దేశానికి ఉపయోగపడే విధంగా ముందుకువెళ్లాలని, అంకిత భావంతో పనిచేయాలని కోరుకుంటున్నామన్నారు.