అనంతపురం, (జనస్వరం) : ఒకే రాష్ట్రంలో రెండు రిజర్వేషన్లు ఎదుర్కొంటున్న వాల్మీకి బోయల స్థితిగతుల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి స్పష్టమైన అవగాహన ఉంది. త్వరలోనే వాల్మీకుల సమస్యల పరిష్కారానికి వారి అభ్యున్నతికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో ముందుకు వస్తామని తనను కలిసిన వాల్మీకి బోయ సంఘాల నాయకులకు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. అనంత జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను బుధవారం వాల్మీకి ఉద్యోగుల సంఘం, వాల్మీకి సేవాదళ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ సానుకూలంగా స్పందిస్తూ… బోయలు వాల్మీకులు తరాలు మారినా పాలకులు మారిన వారి స్థితిగతులు మాత్రం మారడం లేదన్నారు. వారు విద్య, వైద్య ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో అభివృద్ధి చెందాలంటే జనసేనతోనే సాధ్యం అవుతుందన్నారు. ఇప్పటికే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వాల్మీకుల సమస్యలపై అధ్యయనం చేశారు. జనవరిలో మరోసారి వాల్మీకి కుల పెద్దలతో సమీక్ష నిర్వహించి, స్పష్టమైన కార్యాచరణతో మీ ముందుకు వస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అక్కులప్ప వాల్మీకి సేవాదళం రాష్ట్ర నాయకులు కొండపల్లి అక్కులప్ప, లోకేష్ గోపాల్, భాగ్యరాజ్, కదిరప్ప, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జయమ్మ, శేషాద్రి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.