– పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపుతోనే ఫ్లెక్సీలు నిషేధం
– ఫ్లెక్సీల నిషేధంతో కార్మికుల బతుకులు చిన్నాభిన్నం
– జనసేనపార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్
నాయుడుపేట, (జనస్వరం) : నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని సంజయ్ గాంధీ కాలనీలో 25వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ నిర్వహించారు. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన ఉయ్యాల ప్రవీణ్ ప్రజల సమస్యలను తెలుసుకుని అండగా ఉండి పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని విధించిందన్నారు. సెప్టెంబర్ 2న జనసేన అధినేత పవన్ కల్యాణ్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఫ్యాన్స్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న నేపధ్యంలో ఈ ప్లాస్టిక్ ప్లేక్సీలను నిషేదించారన్నారు. అప్పులు చేసి ఫ్లెక్సీ ప్రింటింగ్ పరికరాలను కొనుగోలు చేసిన నిర్వాహకులు ఈ నిషేధంతో ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అలాగే దీనిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న కార్మికులు సైతం రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం కూడా సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలానే ఉందన్నారు. గతంలో పవన్ కల్యాణ్ సినిమా విడుదల వరకు తగ్గిన సినిమా టికెట్ రేట్లు, ఆ తర్వాత మళ్లీ పెరిగినట్టు… ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద నిషేధం కూడా పవన్ కల్యాణ్ పుట్టినరోజు వరకు ఉండి ఆ తర్వాత మాయమవుతుందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ కంటే ముందు జగన్ ను బ్యాన్ చేయాలని, లేదంటే ఏపీనే బ్యాన్ అయ్యే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.