• నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడవద్దు
• పదవి విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
• రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి
• జనసేన జిల్లా నాయకులు పవన్ కుమార్
కర్నూలు ( జనస్వరం ) : పదవి విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని జనసేన జిల్లా నాయకులు పవన్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ నందు ఉన్న జనసేన కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడకుండా, వైసీపీ పాదయాత్రలో చెప్పిన విధంగా ప్రతి జనవరికి అన్ని ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీ ఉద్యోగాల కోసం జాబు క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు అడగని పదవి విరమణ వయస్సు రెండు సంవత్సరాలు పెంచి నిరుద్యోగులను మరో సారి మోసం చేస్తున్నారని తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 20లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో ఎన్నో ఏళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం తీసుకున్న వయస్సు పెంపు నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతను కలుపుకోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గోన్నారు.