నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట పదకొండో రోజున మైపాడు రోడ్డు ప్రాంతంలోని రాజీవ్ గాంధీ కాలనీలో విజయవంతంగా జరిగింది. కేతంరెడ్డి ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటికి తిరిగి అందరి సమస్యలను సావధానంగా విని అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డికి పలువురు ప్రజలు ఇటీవల నెల్లూరు వరదల్లో తమకు ఏర్పడిన పరిస్థితులను వివరించారు. సోమశిల నిర్వహణా లోపం వల్ల పెన్నా నదికి ఎప్పుడూ లేనంత వరద వస్తున్నా తమ ప్రాంతానికి అధికారులు సరైన హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. తమ ఇళ్ళు నీట మునిగి తామంతా ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నా కూడా ఆ సమయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందలేదన్నారు. వరదల్లో నీట మునిగిన ఇంటికి రెండు వేల రూపాయలు అందిస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటించినా కూడా ఆ సాయం ఇప్పటివరకు తమకు అందలేదని వాపోయారు. ప్రభుత్వం తరఫున ఒక్క ఆహార పొట్లం కూడా ఎవరూ అందివ్వలేదని, స్వచ్చంద సంస్థలతో కలిసి జనసేన పార్టీ కార్యకర్తలు తమకు ఆ సమయంలో ఆహారం అందించారని గుర్తు చేశారు. ఈ సమస్యతో పాటు అనేక సమస్యలు విన్న కేతంరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందాలంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమని, పవనన్నకు ఈ సారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలోకి వరద నీరు చేరకుండా శాశ్వత ఏర్పాట్లు చేస్తామని ప్రజలకు కేతంరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com